ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు మీద ఉంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై, కవితకు గతంలో అకౌంటెంట్ గా పని చేసిన బుచ్చిబాబును కలిపి విచారించాలని ఈడీ అనుకుంటోంది. దీని కోసం బుచ్చి బాబును తమ కస్టడీకి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరింది. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది.
ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న రావాలని నోటీసుల్లో తెలిపింది. కానీ, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఆయనకు మార్చి 13 వరకు గడువు ఇచ్చామని ఈడీ వెల్లడించింది. ఆయన హాజరు కావాల్సి వుందన్నారు. ఈ క్రమంలో 15న రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాల్సి వుందని కోర్టుకు ఈడీ తెలిపింది.
దీనికి సంబంధించి పిళ్లై, బుచ్చిబాబును కలిపి విచారించాలని అనుకుంటున్నామని వెల్లడించింది. ఇటు సోమవారంతో పిళ్లై కస్టడీ ముగిసింది. ఆయన కస్టడీని పోడిగించాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. విచారణ సందర్బంగా సందర్భంగా పిళ్లైపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీసులివ్వగానే పిళ్లై తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకున్నారని ఆరోపించింది. ఈ స్టేట్ మెంట్ కు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారాలున్నాయని తెలిపింది. విచారణ సందర్భంగా పిళ్లైని ఒత్తిడి చేయలేదని.. బెదిరించలేదని చెప్పింది.
2022 సెప్టెంబర్ 18న పిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. సెకండ్, థర్డ్ స్టేట్ మెంట్ లలో కూడా కవితకు సంబంధించిన వివరాలను పిళ్లై కన్ఫార్మ్ చేశారన్నారు. ఇప్పుడు ఆయన స్టేట్ మెంట్ ను ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోందన్నారు. విచారణ తర్వాత రామచంద్ర పిళ్లై కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. మార్చి 16 వరకు అతను ఈడీ కస్టడీలో ఉండనున్నారు.