– తెలంగాణలోనూ లిక్కర్ స్కాం..
– దందా వెనుక ఎవరున్నోరో సీఎం తేల్చాలి
– చీప్ లిక్కర్ కు ఖరీదైన లేబుల్స్
– దమ్ముంటే కేసీఆర్ విచారణకు ఆదేశించాలి
– కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదు!
– బీఆర్ఎస్ సర్కార్ పై బండి ఫైర్
టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ లిక్కర్ స్కాం జరిగిందని విమర్శించారు. ఈ లిక్కర్ దందా వెనుక ఎవరున్నారో సీఎం కేసీఆరే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు బండి.
కవిత ఆ స్కాంలో ఉన్నారని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికీ బాగా తెలుసని.. అందుకే సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు. ఇక తెలంగాణ చీప్ లిక్కర్ కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ దీనిపై విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. మోడీ పాలనలో అవినీతికి అవకాశం లేదన్నారు బండి.
గ్రానైట్ లో వందల కోట్లు తనకు ముట్టాయని వస్తున్న ఆరోపణలు నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తనకు రాజగోపాల్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అదంతా మీడియా సృష్టించిందే అని అన్నారు.
బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని.. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ కేసీఆర్ సర్కార్ లో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రజలు తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగి విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం క్యాండిడేట్ల మధ్య పోటీ నెలకొందన్నారు బండి సంజయ్.