హైదరాబాద్, తొలివెలుగు:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఇందులో ఢిల్లీ పేరున్నా కూడా దుమారం మాత్రం తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్రం, తెలంగాణ సర్కార్ మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా సీబీఐ ఈ కేసు విచారణలో తెలంగాణ లింకులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. దీంతో కారు పార్టీలో కాక పుడుతోంది. అయితే.. మొదటినుంచి కవిత పేరు ఈ స్కాంలో వినిపిస్తూ వచ్చినా… కేంద్రం కావాలనే చేస్తుందన్న ధోరణితో టీఆర్ఎస్ శ్రేణులు లైట్ తీసుకున్నారు. కానీ, రోజులు గడిచేకొద్దీ కవితే ఈ స్కాంలో కీలకమన్న సీబీఐ వాదనతో టీఆర్ఎస్ లో కొత్త చర్చ మొదలైంది. అసలు ఈ స్కాం వైపు ఆమెను లాగిందెవరు అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గులాబీ శ్రేణులు. మొదట్లో ఢిల్లీ నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు చాలా మంది నమ్మలేదు. అసలు కవిత ఏంటీ..? ఢిల్లీ లిక్కర్ పాలసీలో వేలు పెట్టడం ఏంటి? అని అనుకున్నారు. ఎందుకంటే కవితకు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయన్నది ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు కూడా ఆమె పేరునే ప్రధానంగా వినిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరి ప్రోత్సాహం కారణంగా ఈ బిజినెస్ చేయాల్సి వచ్చిందనే దానిపై టీఆర్ఎస్ లో హాట్ హాట్ చర్చ సాగుతోందట. ఈక్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ ఎంపీదే కీలక పాత్రగా చెబుతున్నారు. ఆయనతోపాటు మిగిలిన వారు పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని కవితను మభ్య పెట్టి ఇందులోకి దింపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారట గులాబీ శ్రేణులు. అయితే..ఈ మధ్య కాలంలో సదరు ఎంపీ తన ఫోన్ పోయిందని చెబుతుండడంతో అనేక వందతులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు వరుసగా ఒక్కొక్కరు స్కాంలో ఇరుక్కుంటుంటే.. అతను మాత్రం మెల్లగా తప్పించుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అతని బండారం ఎప్పుడు బయట పడుతుందో అని చూస్తున్నారు. ఆ ఎంపీ మాటలు విని కవిత చిక్కుల్లో పడి పోయారని అనుకుంటున్నారు. శరత్ రెడ్డి, మాగుంటలు పెట్టుబడులు పెట్టారని.. కవిత కూడా ఇందులో కీలకంగా మారితే ఏం జరుగుతుందో అనే టెన్షన్ లో ఉన్నారట గులాబీ నేతలు. ఆమె ప్రమేయం లేకుండా ఇంత బలంగా ఆరోపణలు రావని భావిస్తున్న నేతలు.. ఈ వ్యవహారం మొత్తంలో నిజానిజాలు త్వరలో తేలుతే బాగుంటుందని భావిస్తున్నారు.
కవితను లాగింది ఆయనేనా?
– లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందా?
– ఉంటే ఆమెను ఇందులోకి దింపిందెవరు?
– లాభాలు వస్తాయని మభ్యపెట్టిందెవరు?
– ఏపీ ఎంపీనే అసలు సూత్రధారా?
– అతని బండారం కూడా బయటపడుతుందా?
– లిక్కర్ స్కాం వాటాపై టీఆర్ఎస్ లోనూ జోరుగా చర్చ!