సంక్రాంతి సందడి ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి బాక్సాఫీస్ పై పడింది. ఫిబ్రవరిలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి. ఏ వారం ఏ సినిమా వస్తుందో చూద్దాం. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల ఈ విడుదలలన్నీ తాత్కాలికం మాత్రమే. రిలీజయ్యే వరకు ఇందులో ఏవి పక్కా అనేది చెప్పలేం. ప్రస్తుతానికైతే ఏ వారం ఏ సినిమా లాక్ అయిందో చూద్దాం.
ఫిబ్రవరి మొదటి వారంలో సామాన్యుడు, కే3-కోటికొక్కడు, అతడు ఆమె ప్రియుడు, స్వ, కోతలరాయుడు, రియల్ దండుపాళ్యం సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో సామాన్యుడు సినిమాలో విశాల్ హీరో. కాస్త అంచనాలతో వస్తున్న సినిమా ఇది మాత్రమే. కే3లో సుదీప్, అతడు ఆమె ప్రియుడులో సునీల్, కోతలరాయుడులో శ్రీకాంత్ హీరోలుగా నటించారు.
ఇక ఫిబ్రవరి రెండో వారంలో డీజే టిల్లూ, ఖిలాడీ, షెహరి సినిమాలున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది డీజే టిల్లూ. సిద్ధూ జొన్నలగడ్డ హీరో. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రవితేజ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ఖిలాడీ. మాస్ రాజా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. రమేష్ వర్మ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. కొత్త హీరోతో తెరకెక్కిన షెహరి సినిమా కూడా రెండో వారంలో ఉంది. ఈ సినిమాలతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా కూడా ఇదే వారంలో వచ్చే అవకాశాలున్నాయి.
ఇక ఫిబ్రవరిలో మిగిలిన 2 వారాలకు అప్పుడే సినిమాలు షెడ్యూల్ అవ్వలేదు. ఫిబ్రవరి 25న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మాత్రం ఉంది. ఆ తేదీకి రావాల్సిన భీమ్లానాయక్ వాయిదా పడింది. విక్రాంత్ రోణ, వాలిమై లాంటి సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ 10-12 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి