ఐపీఎల్ సీజన్ 13 కోసం వేలానికి సర్వం సిద్ధమయిపోయింది. కోల్‌కతా వేదికగా వేలం ప్రక్రియ సాగబోతుంది. ఈ వేలంలో ఆయా ప్రాంచెజీలు అంటిపెట్టుకున్న ఆటగాళ్లు పోను 332మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు.
రెండు కోట్ల ధర ఆటగాళ్లు వీరే:
కనీసం రెండు కోట్ల ధర ఉన్న ఆటగాళ్ల లిస్టులో ఆస్ట్రేలియా నుండి కమిన్స్, హెజిల్‌వుడ్, క్రిస్‌లిన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా నుండి డేల్ స్టెయిన్, శ్రీలంక నుండి మ్యాథ్యూస్ అందుబాటులో ఉంటారు. ఈ ఆటగాళ్లు అందరూ అంతర్జాతీయ క్రికెట్‌లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారు కావటంతో… వీరు ఎంత ధరకు వెళ్లారు, ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఇయాన్ మోర్గాన్, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీలాంటి ఇంగ్లండ్ ప్లేయర్స్ కనీస ధర 1.5కోట్లుగా నిర్ణయించారు. ఆడం జంపా, క్రిస్ మోరిస్, అబాట్, రాబిన్ ఊతప్ప కూడా ఇదే లిస్ట్‌లో ఉన్నారు.
కోటి రూపాయల లిస్టులో…
కనీసం కోటి రూపాయల ధర నిర్ణయించిన లిస్టులో ఆరోన్ ఫించ్, గుప్తిల్, ఎవిన్ లూయిస్, మున్రో, స్టెయినీస్, సామ్ కరన్, టామ్ కరన్, హెన్రిక్స్, తిసారా పెరీరా, షార్ట్, ముస్తాఫికర్ రెహమన్, కౌల్టర్ నైల్, ఆండ్రూటై, టిమ్ సౌథీ, ప్యాటిన్సన్, ఫ్లంకెట్, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్, జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు.
ఇక 75లక్షల ధరలో డేవిడ్ మిల్లర్, లెండిల్ సిమన్స్, ముష్ఫీకర్ రహీమ్, గ్రాండ్ హోమ్, హోల్డర్, జోర్డాన్, మహ్మదుల్లాలు ఉండగా… 50లక్షల ధరలో పుజారా, హనుమ విహారీ, నమన్ ఓజా, సౌరభ్ తివారీ, మనోజ్ తివారి, స్టువర్ట్ బిన్నిలతో పాటు కొందరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
మొత్తం వేలంలో… 332మంది ఆటగాళ్లు ఉండగా… 24మంది కొత్త ఆటగాళ్లు తెరపైకి వచ్చారు. అయితే ఇందులో కేవలం 73మందిని మాత్రమే తీసుకోవాల్సి ఉంది.
ఇక చెన్నై టీం ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్ల కోసం 14.60కోట్లు వెచ్చించవచ్చు. ఢిల్లీ టీంకు 11మంది ఆటగాళ్ల అవసరం ఉండగా అందులో 5గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఢిల్లీ వద్ద ఇంకా 27.85కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉంది. పంజాబ్ టీంకు ఇప్పుడు అత్యధికంగా 42.70కోట్లు చేతిలో ఉన్నాయి. అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కలుపుకొని మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ముంబాయి టీంకు 13.05కోట్లు చేతిలో ఉండగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు మరో ఐదుగురు స్వదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ వద్ద 28.90కోట్లు చేతిలో ఉండగా 4గురు విదేశీ ప్లేయర్స్‌ను కలుపుకొని 11మందిని కొనుగోలు చేసేందుకు వీలుంది. ఇక నాకౌట్ దశలో బోల్తా కొట్టే అలవాటున్న బెంగుళూరు టీంకు 27.90కోట్లతో ఆరుగురు స్వదేశీ, ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే చాన్స్ ఉంది.
హైదరాబాద్ టీంకు 17కోట్లు చేతిలో ఉన్నాయి. ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లను కలుపుకొని మొత్తం 7గురు ఆటగాళ్లను తీసుకునే వీలుంది. అంటే… గురువారం జరగబోయే వేలంలో అన్ని జట్లు కలిపి 207.65కోట్ల పెట్టుబడితో ఆటగాళ్లను కొనుగోలు చేయబోతున్నాయి. అన్ని జట్లకు కలిపి కేవలం ఆటగాళ్ల కోసమే 472.35కోట్లు ఖర్చు పెడుతున్నాయి.