
తెలంగాణలో లాక్ డౌన్ సడలిస్తూ సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. జిల్లాల్లో అన్ని షాపులు ఓపెన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినా, హైదరాబాద్ నగరంలో మాత్రం సరి, బేసి విధానం ద్వారా షాపులు ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ కసరత్తు పూర్తి చేసి ఆదేశాలు జారీ చేసింది.
అధికారులు ఇచ్చిన నెంబర్ల ఆధారంగా షాపులు రోజు విడిచి రోజు తెరవాలి. కాదు కూడదు అంటే… లాక్ డౌన్ ఎత్తేసే వరకు ఆ షాపులను పూర్తిగా మూసివేయాలని మున్సిపల్ శాఖ తేల్చి చెప్పింది. జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు తమ సిబ్బందితో కలిసి ఈ నెంబరింగ్ విధానం వేయాలని… ఆ నెంబర్లు పాటించేలా చూసుకోవాలని సర్కార్ ఆదేశించింది.
ఏదో ఒక కార్నర్ నుండి మొదలు పెట్టి సోమవారం తెరిచే షాపులు అంటే డే-1కు 1, మంగళవారం తెరిచే షాపుకు 2 వేస్తూ… సరి సంఖ్య నెంబరు వేసే రోజు సరి సంఖ్య ఉన్న షాపులు, బేసి సంఖ్య నెంబర్ రోజు బేసి సంఖ్య షాపులు తెరవాలని ఆదేశించింది.
ఇక నో మాస్క్-నో గూడ్స్ అనే విధంగా చర్యలు తీసుకోవటంతో పాటు శానిటైజేషన్, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలు కఠినంగా ఉల్లంఘించని యెడల షాపులను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది.