వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ లను ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు జనవరి 10 వరకు జుడిషియల్ కస్టడీకి పంపింది. వీడియోకాన్ గ్రూప్ లోని కంపెనీలకు ఈ బ్యాంక్ ‘ఉదారంగా’ మంజూరు చేసిన రుణాల్లో ఎన్నో అవకతవకలు, మోసాలు జరిగాయని ఇదివరకే పలు ఆరోపణలు వచ్చాయి.
వేణుగోపాల్ దూత్ ని సోమవారం అరెస్టు చేయగా.. చందా కొచ్చర్ దంపతులను గతవారం సీబీఐ అరెస్టు చేసింది. వేణుగోపాల్ దూత్ ఆధ్వర్యం లోని వీడియోకాన్ కంపెనీలకు ఈ బ్యాంక్ 3,250 కోట్ల మేర రుణాలు మంజూరు చేసిందని, ఈ వ్యవహారంలో బ్యాంకింగ్ నిబంధనలు, రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉల్లంఘన జరిగిందని సీబీఐ పేర్కొంది.
నూపవర్ రెనివబుల్స్ , సుప్రీం ఎనర్జీ, ఇంకా వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ సంస్థలకు రుణాల మంజూరుకు సంబంధించి 2019 లోనే వీరిపై అభియోగాలు వచ్చాయి. చందా కొచ్చర్ సహకారంతో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేణుగోపాల్ దూత్ ఈ రుణం తీసుకుని అందులో కొంత మొత్తాన్ని నూపవర్ రెనివబుల్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడని, ఈ వ్యవహారం క్విడ్ ప్రోకో పధ్దతిన సాగిందని సీబీఐ లోగడ ఆరోపించింది. ఇందులో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఈడీ సైతం గుర్తించింది. చందా కొచ్చర్ ను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నేరారోపణ కింద గత ఏడాది సెప్టెంబరులోనే అరెస్టు చేశారు.
ఇక ఈ కేసులో సీబీఐ తమను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్ దంపతులు ఈ నెల 27 న బాంబేహైకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టుకు ముందు సీబీఐ ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ఈ అంశంపై అత్యవసర విచారణను తోసిపుచ్చిన వెకేషన్ బెంచ్.. కోర్టుకు సెలవులు ముగిసిన అనంతరం పిటిషన్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.