ఐసీఐసీఐ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ముంబై జైలు నుంచి విడుదలయ్యారు. ఈ రోజు ఉదయం బైకులాలోని మహిళా జైలు నుంచి చందా కొచ్చర్, ఆర్థర్ జైలు నుంచి దీపక్ కొచ్చర్‌లు బయటకు వచ్చారు. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది.
వీడియోకాన్ సంస్థకు రుణాలు మంజూరు చేసే సమయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన డిసెంబర్ 25న కొచ్చర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
కొచ్చర్ దంపతులు వారం రోజుల పాటు సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం వారిని కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ నెలలో తమ కుమారుడి వివాహం ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కొచ్చర్ దంపతులు ఆశ్రయించారు.
పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. కొచ్చర్ దంపతులను అరెస్టు నిబంధనలకు అనుగుణంగా లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కొచ్చర్ దంపతులు కుమారున్ని కౌగిలించుకున్నారు.