– సొంత పార్టీ నుంచే చిక్కులు
– ఒంటెద్దు పోకడలే కారణమా?
– అజయ్ జోక్యం ఎక్కువ అవుతోందా?
– అలంపూర్ లో ఏం జరుగుతోంది?
అధికార టీఆర్ఎస్ లో అసమ్మతి సెగ కమ్ముకుంటోంది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని స్థానాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి. తాజాగా.. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంపై సొంత పార్టీకి చెందిన నేతలే భగ్గుమన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు స్థానిక లీడర్లు ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎమ్మెల్యే అనే అహంకారంతో తమను అవమానిస్తున్నారని వారంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. దీనిపై జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు లాంటి వినతిపత్రం ఒకటి బయటకొచ్చింది.
ఎమ్మెల్యే ఏం చేసినా పార్టీ కోసం ఇంతకాలం భరించామని.. తమ ఓపిక నశించిందని మంత్రుల దగ్గర మొరపెట్టుకున్నారు స్థానిక నేతలు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలని కేటీఆర్ ఆదేశించినప్పటికీ.. పట్టించుకోకుండా తన క్యాంపు ఆఫీసులోనే పంచుతున్నారని చెప్పారు. ఒక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో తమకు గౌరవం లేకుండా పోతోందని అందరూ కలిసి ఫిర్యాదు చేశారు.
తమ మండలాలకు వచ్చినప్పుడు కూడా ప్రొటోకాల్ పాటించడంలేదని వాపోయారు. ప్రతిపనిలో కమీషన్లు తీసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని.. ఆయన తీరువల్ల పార్టీ ప్రతిష్ట గంగలో కలుస్తోందని ఫైరయ్యారు. ప్రతి విషయంలో ఎమ్మెల్యే కుమారుడు అజయ్ జోక్యం పెరిగిపోతోందని కూడా మంత్రులకు కంప్లయింట్ చేశారు నేతలు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను టీఆర్ఎస్ వ్యతిరేకులకు కేటాయిస్తున్నారని కూడా చెప్పారు. అయితే.. కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నం చేస్తే ప్లీనరీ పనుల్లో బిజీగా ఉండడంతో తర్వాత కలవాలని సూచించారట.
ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుమారుడు అజయ్ కి సీటు ఇప్పించేందుకు అబ్రహం ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అటు జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తన వర్గానికి చెందిన వారిని పోటీ చేయించాలని ఆశిస్తున్నట్టు టాక్‌నడుస్తోంది. ఈ నేపథ్యంలో అబ్రహంపై సొంతపార్టీ నేతలే ఎదురు తిరగడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
మంత్రులను కలిసినవారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల, ఐజ జడ్పీటీసీ మెంబర్లు రాములమ్మ, శంషాద్ బేగం, హనుమంతరెడ్డి, పుష్పమ్మ, రాజోలి, ఐజ, ఇటిక్యాల ఎంపీపీలు మరియమ్మ, నాగేశ్వర్ రెడ్డి, స్నేహ, ఇటిక్యాల, మానవపాడు, ఐజ పీఏసీఎస్ చైర్మన్లు రంగారెడ్డి, శ్రీధర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఐజ మున్సిపల్ చైర్ పర్సన్ దేవన్న, ఆలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామదేవరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం.