ఇంకో నెల రోజుల్లో ఆ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు. నిండు నూరేళ్ళు కలిసి హాయిగా బ్రతకాలనుకున్నారు. కానీ విది వారిని కాటేసింది. రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ట్రైన్ ఢీ కొట్టి ఆ ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. హైదరాబాద్ చందానగర్ సమీపంలోని పాపి రెడ్డి నగర్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీ కొట్టి సోని, మనోహర్ అనే జంట ప్రాణాలు విడిచారు. పాపిరెడ్డి నగర్ లోని నివాసంలో ఈ ఇద్దరి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇటీవలే సోని, మనోహర్ కు నిశ్చితార్థం కూడా జరిగింది. ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.
పెళ్లి దగ్గర పడుతుండటంతో ఇద్దరు షాపింగ్ కోసమని చందానగర్ బయలుదేరారు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద చెత్తాచెదారం పెరిగి కంపు కొడుతుండటంతో వారిద్దరూ రైలు పట్టాలు దాటి అవతలి వైపునకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఎంఎంటీఎస్ రైలు మనోహర్, సోనీని ఢీకొని వెళ్లిపోయింది. చెల్లాచెదురుగా పడి వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.