కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కార్యక్రమం చేపట్టాయి. జనతా కర్ఫ్యూ రోజునే తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ ప్రకటించగానే… సీఎం జగన్ కూడా రాష్ట్ర సరిహాద్దులు మూసివేస్తూ, లాక్ డౌన్ ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇండియా లాక్ డౌన్ ప్రకటన చేశారు.
ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల లాక్ డౌన్ ప్రకటన మార్చి 31 వరకు ఉన్నా, కేంద్రం ప్రకటనతో ఏప్రిల్ 14 వరకు పొగించుకున్నారు. అయితే…ఈ లాక్ డౌన్ పిరయడ్ లో కరోనా వైరస్ ఉదృతి తగ్గుతుందని అంతా అంచనా వేశారు. మొదట్లో కాస్త ఫలితం ఉన్నట్లు కనిపించినా, ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారు వారి వారి రాష్ట్రాలకు వెళ్లిపోవటంతో వైరస్ వ్యాప్తి అధికమై, కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.
కానీ 21 రోజుల లాక్ డౌన్ తో ఇప్పటికే ఆర్థిక రంగం కుదేలయ్యే పరిస్థితి తలెత్తింది. నిత్యావసరాల విషయంలో చిన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా ప్రజల అసౌకర్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వాలే ఆదాయం లేకపోవటంతో… తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తారు అన్న ప్రచారం సాగుతోంది. అయితే… తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినా, కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండి, కేంద్రం ఇప్పటికే రెడ్ జోన్ గా నోటిఫై చేసిన జిల్లాల్లో లాక్ డౌన్ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అంటే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత పరిధిలో లాక్ డౌన్ కొనసాగించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నట్లు కనపడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, చిత్తూర్,తూర్పు గోదావరి,గుంటూరు,కృష్ణా,ప్రకాశం, నెల్లూరు, కర్నూల్ జిల్లాల్లో లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఇప్పటికీ ప్రతి రోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో… వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు.