కరోనా రెండేళ్ల క్రితం చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి జనజీవనాన్ని అతలకుతలం చేసింది. ఇప్పటి ఆ మహామ్మారి పూర్తిగా అంతం కాలేదు. వ్యాక్సిన్లు తీసుకున్న కరోనా వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇక కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో తాజాగా కరోనా బారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో కట్టడి చర్యలు ముమ్మరం చేసింది చైనా ప్రభుత్వం. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షలు విధించింది.
చైనాలోని అతి పెద్ద నగరమైన షాంఘైలో గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నగరంలో దాదాపు 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. గడిచిన నెలలో చైనాలో 56 వేల కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,219 కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ప్రజలకు కోవిడ్ సోకినా లక్షణాలు మాత్రం కనిపించలేదు. దీంతో షాంఘైలో ఐదు రోజులపాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు అక్కడి అధికారులు.
ఇప్పటికే చైనాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తప్పనిసరి అయితేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి వీళ్లేదని ఆదేశించారు.
ఇక మరో కీలక నగరమైన షెన్ జెన్‌లో కూడా లాక్‌డౌన్ పరిస్థితులు తలపిస్తున్నాయి. వారం రోజులపాటు షెన్జెన్ నుంచి సమీప గ్రామాలకు రవాణాపై ఆంక్షలు విధించారు అధికారులు. ఇక మెట్రో సేవలు కూడా రద్దు చేసింనట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి నుంచి ఇక్కడ కేసులు క్రమంగా పెరుగుతూ రాగా.. ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. దీనితో కట్టడి చర్యలు ప్రారంభించింది చైనా ప్రభుత్వం.
చైనాలో టీకా పంపిణీ రేటు దాదాపు 87 శాతంగా ఉండగా.. వృద్ధులలో ఇది చాలా తక్కువగా ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 5.2 కోట్ల మంది టీకాలు తీసుకోలేదని చైనా జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక నగరంలోని ప్రజలందరికీ మూకుమ్మడిగా కోవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. ప్రజలందరికి కోవిడ్ టెస్టింగ్ కిట్లను సోమవారం నుంచి అందచేయనున్నారు. జిలిన్‌లోని ఈశాన్య ప్రావిన్స్‌లో కూడా 5,00,000 ర్యాపిడ్-యాంటిజెన్ కిట్‌లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2019 చివరిలో చైనాలోని వూహాన్ నగరంలో కరోనా బయట పడటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అదుపు చేయగలిగింది.