లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లోనూ సభకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సభలో ఈ రోజు కూడా అాదానీ వ్యవహారం, రాహుల్ వ్యాఖ్యలపై రచ్చ జరిగింది. అధికార, ప్రతి పక్షాలు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి.
రెండో రోజు సమావేశం మొదలు కాగానే కాంగ్రెస్ సభ్యులు అదానీ అంశాన్ని ఎత్తుకున్నారు. హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ వ్యవహారంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని కోరుతూ ప్లకార్డులతో నిరసన తెలిపాయి.
మరో వైపు అధికార పక్షం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి. దేశం గురించి, మన ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ తక్కువ చేసి మాట్లాడారని అన్నాయి. ఆ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి.
సభలో గందరగోళం చోటు చేసుకుంది. సభలో పరిస్థితి అదుపు తప్పడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. సభ పున: ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.