కొన్నాళ్లుగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం జరుగుతోంది. అందులోభాగంగా విశాఖలో ఆదివారం కార్యక్రమం జరగాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం నగరానికి వెళ్లారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ర్యాలీగా ఆయన్ను హోటల్ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే, పోలీసులు అడుగడుగునా ఆంక్షలతో పవన్ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేసిందని జనసేన నేతలు అంటున్నారు.
విమానాశ్రయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ నేతల వాహనాలపై దాడి చేశారు. అయితే.. పోలీసులు జనసేన నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ స్పందించారు. విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దుర్మార్గమని అన్నారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ గదిలోనూ సోదాలు చేయడంపై మండిపడ్డారు లోకేష్. పవన్ దగ్గర ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో వైసీపీ రాజకీయ యాత్ర తుస్ మనడంతో ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు లోకేష్.
జనసేన నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు నాగబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా పోలీసులు పవన్ ఉన్న రూమ్ వద్దకు కూడా వచ్చారని పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాలతో విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి యత్నించిన వారిని గుర్తించామని.. సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు.