ఏపీలో అడుగడుగునా అత్యాచారాలు, వేధింపులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా..? అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో ఇలా రోజుకోచోట మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతుంటే.. ప్రభుత్వంలో చలనం లేదని విరుచుకుపడ్డారు.
విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అని నిలదీశారు. ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు..? అంటూ ప్రశ్నించారు. హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహితపై అమానవీయంగా దాడి చేసి పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడినప్పటికీ.. ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.
మహిళా హోంమంత్రి వనిత అత్యాచారాలు కొన్ని అలా జరుగుతుంటాయ్.. అని మాట్లాడటం అన్యాయమని అన్నారు. జే బ్రాండ్ లిక్కర్ తాగి మానవత్వాన్ని మరిచి అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
గాయపడిన మహిళకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఘటనలతో రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అనే అనుమానం కలుగుతొందని మండిపడ్డారు లోకేష్.