సహకార సంఘాల డెయిరీలను వైసీపీ సర్కార్ నాశనం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పాడి పరిశ్రమపై సీఎం జగన్ కు అవగాహన లేదని ఆయన ఫైర్ అయ్యారు. యువగళం పాదయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. గుండి సెట్టిపల్లిలో పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీ హయాంలో పశువులను కొనేందుకు రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎస్సీలకు 70 శాతం సబ్సిడీ ఇచ్చారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో సబ్సిడీతో దాణా, సైలేజ్ తక్కువ ధరకు ఇచ్చే వారని పేర్కొన్నారు.
కానీ వైసీపీ సర్కార్ వచ్చాక సబ్సిడీలు లేవన్నారు. దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. లీటరుకు రూ.4 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారన్నారు. పాడి రైతులకు ఖర్చు ఎక్కువై ఆదాయం తక్కువగా ఉందన్నారు. పాల ధర చాలా తక్కువగా ఉందన్నారు.
దాణా ఇతర ఖర్చులు చాలా ఎక్కువయ్యాయన్నారు. పశువులకు జబ్బులు వచ్చినప్పుడు సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. పశువుల వైద్యునికి చూపించేందుకే ఒక్కో పశువుకి వెయ్యి రూపాయిల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. టీడీపీ హయాంలో బెయిల్ గడ్డి రూ.180కి దొరికేదన్నారు. కానీ వైసీపీ పాలనలో అది సుమారుగా రూ.400 అయిందన్నారు. గడ్డి కటింగ్ మెషీన్లు, పాలు పిండే మెషీన్లు సబ్సిడీ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాడి రైతులను చంద్రబాబు ప్రోత్సహించారన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఉన్నప్పుడు రైతులు ఆర్దికంగా చాలా బలంగా ఉంటారనే అనే ఆలోచనతో రైతులను చంద్రబాబు చాలా ప్రోత్సహించారని చెప్పారు. టీడీపీ హయాంలో కిలో సైలేజ్ రెండు రూపాయిలకే అందజేశామన్నారు. టీడీపీ హయాంలో మినరల్ మిక్చర్, సైలేజ్, చాపింగ్ మెషీన్లు సబ్సిడీకి ఇచ్చామన్నారు.
చిత్తూరు, ఒంగోలు డెయిరీలను అమూల్‌కి జగన్ రెడ్డి కట్టబెట్టాడన్నారు. రూ.650 కోట్ల ఆస్తులు విలువైన చిత్తూరు డెయిరీని అమూల్ కి కట్టబెట్టడం దారుణమన్నారు. పాడి రైతుల పేరుతో 3 వేల కోట్లు అప్పు తీసుకొని అమూల్ కి కట్టబెడుతున్నారన్నారు. పాడి రైతుల పేరుతో జగన్ రెడ్డి వందల కోట్ల అవినీతికి తెరలేపాడన్నారు.