టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పేద గిరిజన కుంటుంబాలను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని స్వామిని ప్రార్థించానన్నారు.
ఇక రాష్ట్రంలో ఎన్నో పాదయాత్రలు జరిగినా.. లోకేష్ పాదయాత్రలో ఉన్నన్ని ఆంక్షలు ఎప్పుడు చూడలేదన్నారు. జీవో నెంబర్ 1 పేరుతో పాదయాత్రకి పోలీసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇలా ఉంటే లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సత్యవేడు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను పోలీసులు తొలగించారు. ఎన్నికల నియమావళికి విరుద్దమని పోలీసులు ఈ విధంగా చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శ్రీకాళహస్తిలో లోకేష్ పాదయాత్రపై టెన్షన్ నెలకొంది.
టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్ కు పోలీసులు నిరాకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల్లోకి పాదయాత్రకు ప్రవేశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రూట్ మ్యాప్ ను మార్చిన పోలీసులు దానికనుగుణంగా పాదయాత్ర చేసుకోమని చెప్పడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.