నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
‘‘అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే ఎంతో మేలు’’ అని మహాత్ముడు చెప్పింది అక్షర సత్యం. 45 ఏళ్లకే పింఛను, అవ్వాతాతలకు 3 వేలు పింఛను, బిడ్దలను బడికి పంపే ప్రతీ తల్లికీ అమ్మఒడి, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఔట్‌సోర్సింగ్ వారికీ ఉద్యోగ భద్రత అంటూ ఎన్నికలకు ముందు హామీలిచ్చి.. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని ముఖ్యమంత్రి గద్దెనెక్కాక నట్టేట ముంచారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసత్యాలు, బూటకపు హామీలతో ప్రజల్ని వంచించి సాధించిన విజయమూ ఒక విజయమేనా? నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. దౌర్జన్యకారుడు ప్రభుత్వాధినేత అయ్యారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలల సౌధాలపై జేసీబీలు ఇనుప రెక్కలతో విరుచుకుపడుతున్నాయి. 40 ఏళ్ల రాజకీయ మేరునగధీరుడు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ వచ్చారు. నిర్మించడం ఎంత కష్టమో దార్శనికులకు మాత్రమే తెలిసిన విషయం. ఉదాహరణగా ప్రజావేదికనే తీసుకుందాం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తన విధ్వంసప్రవృత్తిని జగన్ బయటపెట్టుకున్నారు. ప్రజావేదికను రాత్రికి రాత్రే కూప్పకూల్చారు. ఇప్పుడు తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ హాల్ నిర్మాణం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్లేందుకు ఎంత వేగంగా అడుగులు వేస్తున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. నవ్యాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఎవరైనా ఈ దశలో ఏం చేస్తారు? మిగిలిన 30 శాతం పనులూ పూర్తిచేసి.. క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటారు. రాజకీయంగా మైలేజ్ సాధించుకుంటారు. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందించినందుకు ప్రజాభిమానాన్ని పొందుతారు. కానీ.. జగన్ రొటీన్ పాలిటిక్స్‌కు చాలా భిన్నం. ఫ్యాక్షన్ కక్షలతో చీనీచెట్లను, అరటితోటలను నరికేయడం మనం చూస్తుంటాం. అచ్చం జగన్ కూడా ఇదే మాదిరిగా ఏ పథకం కొనసాగించినా చంద్రబాబుకు పేరొస్తుంది. పోలవరం పూర్తయితే బాబుకే క్రెడిట్ పోతుందనే దురాలోచనతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారు. రివర్స్ టెండర్ అంటూ ఏకంగా ప్రాజెక్టే ప్రశ్నార్థకమయ్యే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వాధినేత తనకు ఎన్నికల ఖర్చులకు పంపిన నిధులకు క్విడ్ ప్రోకోగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే తాకట్టు పెట్టేస్తున్నారు జగన్ గారు. ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిల పద్దు కింద తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.3600 కోట్లకు పైగా వసూలు చేసుకునేందుకు చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మనం మనం బరంపురం అంటూ ట్రిబ్యునల్ నుంచి కేసు వాపసు తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఇచ్చిన భవనాలను భేషరతుగా తెలంగాణకే తిరిగి అప్పగించేశారు. గోదావరి మిగులు జలాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించి అటు బంగారు తెలంగాణగా, ఇటు రతనాల రాయలసీమగా మార్చేస్తానని కేసీఆర్ చెప్పడం, దీనికి జగన్ తలూపడం అయిపోయాయి. ఇది ఎలా ఉందంటే, అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు గాజులు చేయించినట్టే ఉంది. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండిపోయి ఎగువ నుంచి ప్రమాదకరస్థాయిలో వరద వస్తుంటే.. నిర్వహణ చేతకాక చేతులెత్తేసిన ఏపీ సర్కారుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉందని ఆలస్యంగా గుర్తొచ్చింది. వరద నిర్వహణకు ఎంతో ఉపయోగపడే పోతిరెడ్డిపాడుకు విడుదల చేసిన నీటిపైనా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. సముద్రంలోకి చేరుతున్న నీటిని వాడుకుంటేనే ఏకంగా క్రిష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్కారు.. రేప్పొద్దున వారి భూభాగం మీదుగా తీసుకెళ్లే గోదావరి జలాలు రాయలసీమ బీళ్లను తాకుతాయా? వారి గొంతులను తడుపుతాయా?
ముఖ్యమంత్రిగా రెండు నెలలు పూర్తి చేసుకున్న జగన్ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏ అంశంలోనైనా చంద్రబాబు వైపే వేలు చూపిస్తున్నారు. తామే తప్పు చేసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. విత్తనాల కొరతని రైతులు రోడ్డెక్కితే చంద్రబాబే కారణమన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ప్రజలకు ఏ ఛాన్సూ లేకుండా చేస్తున్నారు. నిరసన తెలిపే హక్కునూ కాలరాసేస్తున్నారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్లు నడిచి.. ప్రజలకు 900కి పైగా హామీలిచ్చారు. ఇవే హామీలలో 400కి పైగా ఎంచుకుని పుస్తకంగా కూడా వేశారు. అధికారంలోకొచ్చాక 9 రత్నాలకే వీటిని కుదించారు. రివర్స్ టెండర్ జపం చేస్తూ ఏపీని ప్రగతిని కూడా రివర్స్‌లో తీసుకెళుతున్నారు. 13 జిల్లాలున్న చిన్న రాష్ట్రమైనా టీడీపీ హయాంలో లెక్కకు మించిన అవార్డులొచ్చాయి. గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచాం. విద్యుత్ ఆదాలో ప్రథమస్థానం ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది. విత్తనాల కొరతకు, పింఛన్ల ఆలస్యంగా పంపిణీకి, అన్నా క్యాంటీన్ల మూసివేతకూ చంద్రబాబే కారణమనే వైకాపా పెద్దలు 2014లో తెలుగుదేశం అధికారం చేపట్టేసరికి 4.64 కోట్లున్న ఏపీ ఆదాయం, 2018 నాటికి 8.04 కోట్లకు పెంచింది చంద్రబాబేనని ఎందుకు ఒప్పుకోరు? పాలన చేతకాకపోతే చంద్రబాబుపైకి నెట్టేయడం, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ప్రశంసలు దక్కితే .. చనిపోయి ఏ లోకాన ఉన్నాడో నాయనను రంగంలోకి దింపి మరీ క్రెడిట్ కొట్టేసే పనులు చేస్తున్నారు. ఇది సిగ్గనిపించడంలేదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీ వల్లే ఏపీకి కియా వచ్చిందని, అధికారంలోకొచ్చాక తన తండ్రి వల్లే వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు సాక్షాత్తు ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కియా వల్ల 20 వేల కోట్ల భారమంటూ విజయసాయిరెడ్డి శైలి లెక్కలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర రాష్ట్రాలను కాదని వచ్చాయంటే.. రాయితీలు ఇవ్వడం వల్లే అనేది అర్థంకాకపోతే ఎలా? ఒక పరిశ్రమ వస్తే దానికి అనుబంధంగా వచ్చిన పరిశ్రమలు.. అందులో వచ్చే వేలాది ఉద్యోగాలు, ప్రభుత్వానికి వచ్చే పన్నులు వంటివన్నీ లెక్కలేస్తే.. ఎన్ని వేల కోట్ల లాభమన్నది కనీసం అర్థం చేసుకునే స్థాయి కూడా లేకపోవడం విచారకరం. పీపీఏల రద్దు, పోలవరం పనులు నిలిపివేత, రివర్స్ టెండర్, అన్నక్యాంటీన్ల నిలిపివేత, కియా యాజమాన్యానికి వైకాపా నుంచే నేరుగా బెదిరింపులతో ఏపీతో గతంలో ఒప్పందాలను చేసుకున్న పరిశ్రమలు అట్నుంచే అటే తరలిపోతున్నాయి. వైకాపా కార్యకర్తలను గ్రామ వలంటీర్లుగా నియమించి లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని ఘనంగా ప్రకటనలు ఇస్తున్న ముఖ్యమంత్రి.. ఊడిపోనున్న ఉద్యోగాలపై మౌనం వహిస్తున్నారెందుకు? గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1,28,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు సరే, ఈ ఉద్యోగాల భర్తీతో తాము ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళనకు దిగిన పంచాయతీల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, గోపాలమిత్రలతోపాటు కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నలక్షల మంది ఆవేదన మీరు విన్నారనుకుంటాను. కానీ మీరున్నారనే ధీమాలో ఉన్నవారికి ఒక్కమాట మిమ్మల్ని తీసేయడంలేదని చెప్పగలరా ముఖ్యమంత్రిగారూ? తెలుగుదేశం ప్రభుత్వహయాంలో ఉచిత ఇసుక విధానం ఎంతో పారదర్శకంగా అమలైంది. సత్పలితాలు కూడా ఇచ్చింది. మీరు అధికారంలోకొచ్చాక ఇసుక కొత్త పాలసీ పేరుతో మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. బస్తా సిమెంట్ కంటే, బస్తా ఇసుక రేటు ఎక్కువగా ఉన్న పరిస్థితికి తీసుకొచ్చారు. ఇసుక కొరతతో దాదాపు 20 లక్షల మంది వరకూ భవన నిర్మాణరంగ కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారు. వారి ఆకలి కేకలు వినండి.. వరద బాధితుల ఆక్రందనలూ మీకు మనసుంటే వినొచ్చు. ఎన్నికలకు ముందు నేనున్నాను అన్నారు. గోదావరి, క్రిష్ణా నదులకు వరదలు వస్తే మీరున్నారని ఎదురుచూసిన బాధితులకు మీరు విదేశాలలో ఉన్నారని తెలుసుకున్నారు. మీరు విన్నారని, వీరు వస్తున్నారని తెలియాలంటే.. ఒక్కసారి ప్రజల్లోకి రావాలి జగన్ గారు. ఆంధ్రుల కలల రాజధాని, ప్రజా రాజధాని అమరావతిపై వైకాపా నాయకులు మాట్లాడుతున్న మాటలు విని బాధేస్తుంది. తమ స్వార్ధ రాజకీయం కోసం ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేస్తే కనీసం అర్ధం ఉంటుంది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా కనీస ఆధారం లేకుండా చేస్తున్న ఆరోపణలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అమరావతి నిర్మాణం కోసం 35 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల బంగారు భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 144 సెక్షన్ పెట్టి కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసి తమ గోడు వినిపించుకునే పరిస్థితి కూడా లేదు అంటే జగన్ గారి పాలన ఎంత పారదర్శకంగా ఉందో అర్ధం అవుతుంది.