పార్లమెంట్‌లో అదానీ గ్రూపు వ్యవహారంపై రచ్చ జరిగింది. హిండెబర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్ నుంచి విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఈ రోజు కూడా ఈ మేరకు ఆందోళనకు దిగాయి.
లోక్‌సభలో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. సభలో నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో విపక్ష సభ్యులంతా తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. ప్రజలు మిమల్ని గమనిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు.
సభలో విపక్షాలు ఆందోళన చేయడం తప్పుడు విధానమన్నారు. సభలో చర్చ జరగాలంటే ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని ఆయన అన్నారు. కానీ విపక్ష సభ్యులు ఆందోళనలు ముగించేందుకు ససేమేరా అనడంతో సభను మధ్యాహ్నాం రెండు గంటల వరకు సభాపతి వాయిదా వేశారు.
మరోవైపు పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ కంపెనీ వ్యవహారంపై సభలో చర్చించాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని సభ్యులు కోరారు. సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో చైర్మన్ ధన్‌కడ్ కలగచేసుకున్నారు. వారు ఆందోళనలు వీడకపోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.