బండి సంజయ్ జాగరణ దీక్ష ఘటనకు సంబంధించి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. బండి ఫిర్యాదు నేపథ్యంలో నోటీసులు పంపింది కమిటీ. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.
జాగరణ ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్ స్పెక్టర్ కు కూడా లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే కమిటీ ముందు హాజరైన బండి తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆరోజు జరిగిందంతా వివరించారు.
317 జీవోను సవరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జనవరి 2న జాగరణ దీక్షకు కూర్చున్నారు సంజయ్. కరీంనగర్ లో తన ఆఫీస్ లో దీక్షలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్యాస్ కట్టర్లతో గేట్ ను బద్దలు కొట్టి, వాటర్ కెనాన్స్ ను ప్రయోగించి బండిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తన హక్కులకు భంగం కలిగించారని బండి సంజయ్ ఫిర్యాదు చేయడంతో లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ రంగంలోకి దిగింది. ఘటనపై సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.