మొన్న రాజమండ్రి.. నిన్న ధవళేశ్వరం.. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మరో లోన్ యాప్ మరణం. ఈ లోన్ యాప్ యమకింకరుల ఆగడాలకు అంతు లేదా? వీరిని ఇలాగే వదిలేస్తారా? ప్రభుత్వాలు పట్టించుకోవా? అని బాధితు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైంది.
కుటుంబంతో కలిసి పండుగకు వస్తాడనుకున్న కొడుకు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రులను కలచివేసింది. ఎంబీఏ చదివిన బిడ్డ అమాయకంగా రుణయాప్ కు బలవుతాడని ఆ కుటుంబం అస్సలు ఊహించలేదు. నా బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదు అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు..
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జి .కొండూరు మండలం వెలగలేరుకు చెందిన రాజేష్ ఎంబీఏ పూర్తి చేశాడు. పెళ్లి తర్వాత రాజేష్ హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. కుటుంబ అవసరాల కోసం..
XP క్యాష్ అనే రుణయాప్ నుంచి లోన్ తీసుకొని తిరిగి చెల్లించాడు రాజేష్.
అయినా సరే లోన్ యాప్ కంపెనీ వేధింపులు ఆగలేదు. అతని న్యూడ్ ఫొటోలను సైతం కుటుంబ సభ్యులకు పంపించడంతో మనస్థాపానికి గురైన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడు రాజేష్. సీఎం కేసీఆర్ .. ప్రధాని మోడీ లోన్ యాప్ నిర్వాహకులలపై కఠిన చర్యలు తీసుకోవాలని..తనలా మరెవరు బలి కాకూడదు అంటూ సూసైడ్ నోట్లో అభ్యర్ధించాడు రాజేష్.