కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. 24 గంటలు గడవకముందే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం.. చకచకా జరిగిపోయాయి. ఈ అంశం కాంగ్రెస్ లో కలవరానికి దారితీసినా.. ధైర్యంగా పోరాటం చేస్తామని హస్తం నేతలు చెబుతున్నారు. కేంద్రం కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అయితే.. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలడంతో.. ఆయనపై ఉన్న మిగిలిన కేసులపై ఆరాలు తీయడం ఎక్కువైంది. నెట్టింట చాలామంది ఈ విషయాన్ని సెర్చ్ చేస్తున్నారు.
రాహుల్ గాంధీపై ఉన్న కేసులివే!
1. 2019 ఎన్నికలకు ముందు దొంగలు అందరూ మోడీ ఇంటిపేరుతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పరువు నష్టం కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ ఈ కేసు పెట్టారు. ఈ కేసులోనే రాహుల్ ని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. 30 రోజుల్లోగా పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని చెబుతూ బెయిల్ మంజూరు చేసింది.
2. మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీహార్ లోని పాట్నాలో మరో పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇది కూడా స్థానిక బీజేపీ నాయకుడు పెట్టిన కేసే.
3. 2019లో రాహుల్ అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంక్ నోట్ల రద్దు సందర్భంగా ఆక్రమాలకి పాల్పడిందని ఆరోపణలు చేశారు. దీనిపై ఆ బ్యాంక్ పరువు నష్టం దావా వేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టుకి హాజరయి బెయిల్ తీసుకొని బయటికి వచ్చారు రాహుల్. ఈ కేసు కూడా త్వరలో విచారణకి రాబోతోంది.
4. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉందంటూ 2019లో ఆరోపణలు చేశారు రాహుల్. దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దాని మీద కూడా ముంబై కోర్టుకి హాజరయి బెయిల్ తీసుకొని బయటికి వచ్చారు రాహుల్. గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ తో కూడిన సంకీర్ణ ప్రభుత్వమే. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
5. అసోంలోని గౌహతి కోర్టులో ఓ కేసు విచారణలో ఉంది. ఇది కూడా పరువు నష్టం దావానే. 2015 డిసెంబర్ లో అసోంలోకి తనను ప్రవేశించకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుకుందంటూ రాహుల్ ఆరోపించారు. దీని మీద గౌహతి కోర్టులో కేసు వేశారు. 2016లో ఈ కేసు విచారణకి వచ్చినప్పుడు రాహుల్ హాజరయి బెయిల్ పొందారు. ఇది కూడా త్వరలో విచారణ పూర్తయ్యే దశలో ఉంది.
6. 2016లో రాహుల్ మాట్లాడుతూ.. గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అని అన్నారు. దీని మీద మహారాష్ట్రలోని భీవండి కోర్టులో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసు వేశాడు. అయితే.. రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు. గాడ్సే విషయంలో ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని చదివి దానిలో ఎక్కడా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన లేదని అలాంటప్పుడు ఎలా ఆరోపణలు చేశారని ప్రశ్నించగా.. తాను విచారణ సమయంలో కోర్టుకి అన్ని ఆధారాలు ఇస్తాను అని చెప్పారు రాహుల్. ఈ కేసు కూడా విచారణ దశలో ఉంది.
7. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఇష్యూలో చాలా కేసులు నమోదయ్యాయి. పత్రిక షేర్లని వాటాదారులకి చెప్పకుండా ఏక పక్షంగా మొత్తం సోనియా, రాహుల్ పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసిన కేసు.
8. మనీ లాండరింగ్ కేసు పెండింగ్ లో ఉంది. ఇది కూడా నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించినదే.
9. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉన్న కార్యాలయాన్ని అద్దెకి ఇచ్చి దాని మీద వచ్చే ఆదాయానికి పన్ను కట్టని కేసు.
10. ఢిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ కార్యాలయం విషయంలో అక్రమంగా భూమిని కబ్జా చేసి కట్టారని అభియోగాలు. ముంబై, నాగపూర్, లక్నో లాంటి నగరాలలో అయితే నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలని పూర్తిగా భూమి కబ్జా చేసి కట్టారని కేసు.
11. భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో తమని అత్యాచారం చేశారంటూ కొందరు మహిళలు తనని కలిసి చెప్పారని రాహుల్ అన్నారు. దీని మీద విచారణ జరుగుతోంది. పైగా, ఈ వ్యాఖ్యలు ఇక్కడకు కాదు లండన్ లో చేశారు. ఈమధ్యే పోలీసులు వివరాల కోసం రాహుల్ ఇంటికి వెళ్లారు. దీని మీద కూడా కేసు నమోదు చేయనున్నారు ఢిల్లీ పోలీసులు.