రాకపోకలు కష్టతరంగా ఉన్న కాలంలో,టెలీఫోన్లు కూడా అందుబాటులో లేని కాలంలో ఒకచోట ఉన్న వార్తను మరోచోటుకు మోసుకుపోయే మాధ్యమం ఉత్తరం. అందుకే దూరాలను కలిపే దారాలు ఉత్తరాలు అన్నారు.
అవును కదా..! మాటల్లో చెప్పలేని ఎన్నోభావాలను ఉత్తరాల ద్వారా చెప్పొచ్చు. పూర్వం వ్యక్తుల మధ్య సంబంధబాంధవ్యాలకు ఉత్తరాలే ముఖ్య వారధి. బోర్డర్లో ఉన్న ఓ కొడుకు తన తల్లికి రాసే క్షేమసమాచారం.
ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి రాసిన సుతిమెత్తని సంగతులు. కొత్తగా కాపురానికి వెళ్ళిన కూతురు తల్లికి తనక్షేమ సమాచారం..ఇలా ఎన్నో కబుర్లు, ఎన్నో ప్రేమలు, ఎన్నోఅనుబంధాలు, ఎన్నో అనుభూతులు మోసుకొచ్చే సాధనాలు ఉత్తరాలు.
ప్రాంతాన్ని బట్టి వాహన సౌకర్యాలను బట్టి ఇప్పుడు ఉత్తరం వేస్తే ఎప్పటికో అందేది. ఆ ఉత్తరం కోసం వెయ్యికళ్ళతో ఎదరు చూసేవారు.ఇంత గొప్పప్రాధాన్యం ఉన్న ఉత్తరం పోస్టు చేసిన 100 యేళ్ళకు వస్తే..!ఎలా ఉంటుంది.
లండన్ లో ఓ లేఖ పోస్ట్ చేసిన 100 ఏళ్ల తర్వాత ఇటీవలే డెలివరీ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి తన ఫ్రెండ్ అయిన కేటీ మార్ష్ కు పోస్ట్ చేశారు.
వందేళ్ల తర్వాత 2021లో ఈ లేఖ లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద లెటర్ బాక్స్ లో తేలింది. రాయల్ మెయిల్ సిబ్బంది వందేళ్ల తర్వాత జాగ్రత్తగా డెలివరీ చేసింది. నిజానికి ఈ లేఖను అందుకోవాల్సిన వ్యక్తి భూమిపై లేరు.
సంబంధిత ఫ్లాట్ లో ఉండే గ్లెన్ (27) అనే వ్యక్తి ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. ఏడాది పాటు ఈ లేఖను అలా చూసిన తర్వాత చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు. ఇంత కాలం పాటు ఎందుకు డెలివరీ చేయలేదనే దానికి రాయల్ మెయిల్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సార్టింగ్ ఆఫీసులో ఇది తప్పిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.