ఇటీవల కాలంలో గాజు వంతెనలు చాలా ఫేమస్ అయ్యాయి. కొన్ని వేల అడుగుల ఎత్తులో గాజు వంతెనపై నడుస్తుంటే.. గాల్లో అడుగులు వేస్తున్నట్లు ఉండే ఆ అనుభూతిని పొందాలని చాలా మంది కోరుకుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు చాలా దేశాల్లో వీటిని నిర్మిస్తున్నారు. వీటిల్లో ఇప్పటి వరకు చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై ఉన్న బ్రిడ్జ్ పొడవైనదిగా గిన్నిస్ రికార్డుల్లో ఉంది. అయితే, తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేసింది వియత్నాం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనను నిర్మించి.. చైనాకు పోటీగా వెనక్కి నెట్టేసింది.
వియత్నాంలోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో 2,073.5 అడుగుల పొడవైన గాజు బ్రిడ్జ్ నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. భూమి నుంచి వంతెన ఎత్తు సుమారుగా 500 అడుగుల ఎత్తులో ఉంది. కాగా, ఈ వంతెనను ఏప్రిల్ 30న ప్రారంభించి.. స్థానికులు, పర్యాటకుల సందర్శన కోసంఅందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బ్రిడ్జ్‌కి బాచ్ లాంగ్ అని పేరును కూడా పెట్టారు.
అయితే, ఈ వంతెన నిర్మాణానికి ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన సూపర్ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఇప్పటికే దీనికి భద్రతను అక్కడి అధికారులు పరిశీలించారు. అలాగే వంతెన పొడవు అత్యంత ఎక్కువగా ఉండడంతో దాని గుర్తింపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్ జియాజీ గ్రాండ్ కాన్యన్ పై నిర్మించిన బ్రిడ్జ్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. ఈ వంతెన నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. 2020 నాటికి పూర్తి చేసి దానిని ఓపెన్ చేశారు. రుయీ బ్రిడ్జ్‌గా నామకరణం చేశారు. పియాన్ పర్వతంపై అద్దాలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అయితే గాలులు విపరీతంగా వీయడంతో బ్రిడ్జ్ అద్దాలు పగిలిపోయిన సందర్భాలు లేకపోలేదు.