క్రికెట్ అంటేనే ముందుగా మనకు బ్యాట్స్‌మెన్లు కొట్టే సిక్సర్లు, ఫోర్లు గుర్తుకు వస్తాయి. టీ20 క్రికెట్ వచ్చాక క్రికెట్‌లో అసలైన వినోదాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బ్యాట్స్‌మెన్లు సిక్సర్ల స్పెషలిస్టులుగా మారారు. వన్డే మ్యాచ్‌లలోనూ కొందరు బ్యాట్స్‌మెన్లను సిక్సర్ల స్పెషలిస్టులుగా పిలుస్తారు. ఇక అలాంటి వారిలో ఇప్పటి వరకు అత్యంత దూరంగా సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
క్రికెట్ చరిత్రలోనే అత్యంత దూరంగా సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో నలుగురు నిలిచారు. వారు భారత్‌కు చెందిన మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోనీ, పాకిస్థాన్‌కు చెందిన మాజీ ప్లేయర్ అఫ్రిది, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఆటగాళ్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మార్క్ వా. వీరు నలుగురూ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యంత దూరంగా సిక్సర్లను బాదారు.
2011-12 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ఆ దేశంతో భారత్ కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో భాగంగా ఒక వన్డే మ్యాచ్‌లో అక్కడి అడిలైడ్ ఓవల్ అనే మైదానంలో ధోనీ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్స్ ఏకంగా 112 మీటర్ల దూరం వెళ్లింది. ఆస్ట్రేలియా బౌలర్ క్లింగ్ మెక్ కే బౌలింగ్‌లో ధోనీ సిక్స్ కొట్టగా.. బంతి అంతటి దూరం ప్రయాణించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 270 పరుగులను 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఆ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇక ఆస్ట్రేలియాకు చెందిన మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2011లో ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీంకు ఆడుతూ ఒక మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా బౌలర్ చార్ల్ లాంగ్‌వెల్ట్ వేసిన ఒక బంతిని సిక్సర్ కొట్టగా అది 122 మీటర్ల దూరం వెళ్లింది. ఆ మ్యాచ్ ధర్మశాలలో జరిగింది.
అలాగే 1997లో ఆస్ట్రేలియాలోని పెర్త్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ డానియెల్ వెటోరీ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్క్ వా భారీ సిక్సర్ కొట్టాడు. దాని దూరం 120 మీటర్లు.
ఇక పాక్ కు చెందిన మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 2013 మార్చి 17న జోహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ 3వ వన్డేలో భారీ సిక్సర్ బాదాడు. ఆ సిక్సర్ వల్ల బంతి 120 మీటర్ల దూరం వెళ్లింది.