శ్రీ రాముడు భారతదేశపు గుర్తింపు అని, కేవలం రాయి లేదా చెక్కతో కూడిన స్వరూపం కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రామ మందిర నిర్మాణం విషయానికి వస్తే, చాలా మంది ప్రజలు దానిపై తమ సలహాలు ఇవ్వడం ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.
ఆ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలని కొందరు సూచించగా, మరికొందరు పాఠశాలను నిర్మించవచ్చని చెప్పారని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేయవచ్చని కూడా కొందరు సూచించారన్నారు. వారంతా రాముడిని అర్థం చేసుకోని లేదా ఆయన్ని ఆలింగనం చేసుకోని వ్యక్తులు అని చెప్పారు.
రాముడు కేవలం రాయి, చెక్క లేదా మట్టితో చేసిన స్వరూపం కాదన్నారు. శ్రీ రాముడు మన సంస్కృతి, విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాడన్నారు. తాము ఆస్పత్రులు, పాఠశాలలు, పరిశ్రమలనూ నిర్మిస్తామన్నారు. అలాగే దేవాలయాలు కూడా నిర్మిస్తామన్నారు.
కేంద్రం ప్రయత్నాల వల్ల ఈశాన్య ప్రాంతాలు ఢిల్లీకి, ప్రజల ‘దిల్’ (హృదయం)కి దగ్గరగా ఉన్నాయని వెల్లడించారు. ఈశాన్యంలో పలు ప్రాంతాల నుంచి సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించడంతో ఆయా ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నారు.