కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించనుంది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం దేవాలయ నిర్మాణం కోసం ఇప్పటికే ఏడు చోట్ల స్థలాలను గుర్తించింది. వీటిలో ఏదో ఒకటిని ఖరారు చేయడం కోసం టీటీడీ అధికారులు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
జమ్మూ-కత్రా హైవేలో ఉన్న స్థలాన్నిటీటీడీకి ఇవ్వడానికి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. రెండేళ్లలో హాస్పిటల్ తో పాటు వేద పాఠశాలను కూడా టీటీడీ నిర్మించనుంది. మా అధికారులు ఇప్పటికే జమ్మూ కశ్మీర్ చీఫ్ సెక్రెటరీని కలిసి ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తర భారత దేశం నుంచి తిరుమలకు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని..దీనిని దృష్టిలో ఉంచుకొని ముంబైలో, జమ్మూలో త్వరలో దేవాలయాలు నిర్మిస్తామని టీటీడీ సభ్యుడు పుట్టా ప్రతాప్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బాంద్రాలో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే స్థలం కేటాయించిందని.. వీటితో పాటు కురుక్షేత్రలో వేద పాఠశాలను కూడా నిర్మిస్తామని చెప్పారు పుట్టా ప్రతాప్ రెడ్డి.