అదంతే.. భారీ తారాగణంతో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో ప్రతి చిన్న పాత్రకు పెద్ద పెద్ద నటులున్నారు. కానీ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్లలో ఒక్కరు కూడా గుర్తుకురారు. అలాఅని తెర మొత్తం ప్రభాస్-పూజాహెగ్డే కెమిస్ట్రీతో నిండిపోయిందనుకుంటే పొరపాటు. కేవలం సదరు నటీనటులకు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదంతే. కొందరికైతే డైలాగ్స్ కూడా లేవు.
సినిమాలో హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ నటించాడు. 2-3 చోట్ల కనిపిస్తాడు కూడా. కానీ ఒక్క డైలాగ్ లేదు. తండ్రి కంటే పెదనాన్న పాత్రను ఎక్కువ ఎలివేట్ చేశారు. హీరోయిన్ కుటుంబంలో మరో నలుగురు సభ్యులుంటారు. వాళ్లందరూ మూకీ ఆర్టిస్టులే. ఇక హాస్పిటల్ సెటప్ లో ప్రియదర్శి కనిపిస్తాడు. పొడిపొడి డైలాగులకే పరిమితమయ్యాడు.
ఇక మరో ముద్దుగుమ్మ తేజస్వి ఈ సినిమాలో ఎందుకుందో తెలీదు. ఓ సీన్ లో ఇలా వచ్చి, ఓ చిన్న డైలాగ్ చెప్పి అలా మాయమౌతుంది. ఎయిర్ టెల్ భామ సాషా ఛత్రి కూడా ఉంది. కానీ ఆమె ఎక్కడుందో కూడా గుర్తుపట్టడం కష్టం. ఇక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ జయరాం కూడా ఇందులో ఉన్నాడు. ఫస్టాఫ్ లో 2-3 కామెడీ సీన్లలో కనిపిస్తాడు. మళ్లీ క్లైమాక్స్ లో కనిపిస్తాడు. ఇంతకుముందు చెప్పుకున్న లిస్ట్ తో పోల్చుకుంటే ఉన్నంతలో మంచి పాత్రే అనుకోవాలి.
ఇవన్నీ ఒకెత్తయితే బాలీవుడ్ వెటరన్ బ్యూటీ భాగ్యశ్రీ మరో ఎత్తు. ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీని ఎందుకు తీసుకున్నారో, ఆమె ఎందుకు అంగీకరించిందో ఎవ్వరికీ అర్థంకాదు. ఈ సినిమా కథకు, భాగ్యశ్రీకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఆమెపై బోలెడన్ని సీన్లు తీశారు. డాన్స్ సన్నివేశాలు పెట్టారు. అసలు భాగ్యశ్రీని క్లాసికల్ డాన్సర్ గా చూపించాల్సిన అవసరం ఏముందో అర్థంకాదు. ఇలా చెప్పుకుంటూపోతే రాధేశ్యామ్ లో అవసరం లేని పాత్రలు, అందులో ప్రముఖులు చాలామంది కనిపిస్తారు.