కర్ణుని చావుకు సవాలక్ష కారణాలున్నట్టు… తరచి చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణమైన వారూ ఉన్నారు. 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే (పటాన్‌చెరు, నాచారం) పరిమితమైన పార్టీ.. ఈసారి కూడా మళ్లీ రెండు స్థానాలే (ఏఎస్‌రావు నగర్, ఉప్పల్) గెలుచుకోగలగడం యాధృచ్చికం. కానీ రాష్ట్రంలో రాజకీయంగా బలపడే పరిస్థితుల్లోనూ ఆశించిన ఫలితం రాకపోవడం నేతల కంటే కార్యకర్తలనే ఎక్కువగా బాధిస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని చెప్తూ వస్తున్నా.. చేతల్లో మాత్రం దాన్ని చూపించకలేపోయారు ఆపార్టీ నేతలు. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత గంపగుత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టడం ప్రజల్లో ఆ పార్టీని చులకన చేసింది. ఈ క్రమంలోనే దుబ్బాకలో అనుకోకుండా గెలవడం కమలం పార్టీకి బూస్ట్‌నిస్తే.. కాంగ్రెస్ శ్రేణులని నిస్తేజంలో పడేసింది.
ఇక గతంలో ఆ పార్టీ తరపున కీలకంగా పనిచేసిన నేతలు పార్టీని వీడటం ఓటమికి మరో కారణమైంది. దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి, బండా కార్తిక రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, విక్రమ్ గౌడ్ వంటి నేతలు పార్టీని వీడటం మైనస్‌గా మారింది. దీనికి తోడు కాంగ్రెస్‌లో గెలిచినా తరువాత టీఆర్ఎస్‌లో చేరుతారనే బీజేపీ ప్రచారం హస్తం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది. ఇక పార్టీ నేతల మధ్య విభేదాలు కూడా వీటికి తోడయ్యాయి.
ఫలితంగా రేవంత్ రెడ్డి లాంటి అతి కొద్ది మంది నేతలు మాత్రమే గ్రేటర్ వార్‌లో పాల్గొన్నారు. కార్యకర్తలను సరైన డైరెక్షన్‌లో నడిపే నాయకుడు లేక చివరికి ఇలా హస్త కన్నీరు పెట్టాల్సి వస్తోంది.