టాలీవుడ్ లో మరో డబ్బింగ్ సినిమా సక్సెస్ అయింది. దిల్ రాజు రిలీజ్ చేసిన లవ్ టుడే సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్టయింది. రిలీజైన 3 రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టింది.
రోజురోజుకు ఈ సినిమా తన వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. మొదటి రోజు 2 కోట్ల 22 లక్షల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 2 కోట్ల 35 లక్షలు, మూడో రోజైన ఆదివారం నాడు 2 కోట్ల 38 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది.
ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ఏపీ, నైజాంలో లవ్ టుడే సినిమాకు 3 కోట్ల 61 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగులో ఈ సినిమాను 3 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే, మూడో రోజుకే 61 లక్షల రూపాయల లాభం తెచ్చిపెట్టిందన్నమాట.
యూత్ మూవీ కావడంతో.. ఈ సినిమాకు వర్కింగ్ డేస్ తో సంబంధం లేదు. సోమ, మంగళ, బుధవారాలు అనే తేడా లేకుండా యూత్ ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ శుక్రవారం హిట్-2, మట్టి కుస్తీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవి థియేటర్లలోకి వచ్చేలోపు లవ్ టుడే సినిమా కనీసం 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.