చూస్తుంటే, తమిళ్ కంటే తెలుగులోనే లవ్ టుడే పెద్ద హిట్టయినట్టుంది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమాకు 13.13 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు. అయితే.. ఈ లాభాలన్నీ పూర్తిగా అతడికి మాత్రమే దక్కవు.
లవ్ టుడే రైట్స్ ను సోలోగా దక్కించుకోలేదు దిల్ రాజు. ఈ సినిమాను షేరింగ్ విధానంలో తెలుగులో రిలీజ్ చేశాడు. దీంతో మేజర్ వాటా అసలైన నిర్మాతలకే వెళ్లిపోతుంది. దిల్ రాజుకు థియేట్రికల్ ఖర్చులతో పాటు కొంత షేర్ వస్తోంది. అలా ఓ మంచి సినిమాను దిల్ రాజు వదులుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇక లవ్ టుడే వసూళ్ల విషయానికొస్తే.. మొదటి రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారు. ప్రతిరోజూ ఈ సినిమాను ఏపీ-నైజాంలో కనీసం 40 లక్షల రూపాయల షేర్ వస్తోంది. ప్రాంతాలవారీగా చూసుకంటే.. ఇప్పటివరకు నైజాం నుంచి ఈ సినిమాకు 6 కోట్ల 40 లక్షలు, సీడెడ్ నుంచి కోటి పాతిక లక్షలు, ఆంధ్రా నుంచి 5 కోట్ల 48 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.
మూడున్నర కోట్ల రూపాయలొస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కానీ, ఇప్పటివరకు 7 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా తెలుగులో లవ్ టుడే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.