తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రమోన్మాది ఆ యువతి మొత్తం కుటుంబం పైనే పగ పెంచుకున్నాడు. యువతి తండ్రి పశువుల మేతకు నిప్పు పెట్టాడు. అంతటితో ఆగకుండా కత్తి పట్టుకొని ఆ యువతి ఇంటికొచ్చి ఆమె పై నిర్థాక్షిణ్యంగా దాడి చేశాడు. అడ్డంగా వచ్చిన ఆ యువతి తల్లి, చెల్లి పై కూడా అదే కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆ ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చి గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ మాణిక్యం అనే యువతి వెంటపడుతున్నాడు కళ్యాణ్. దీంతో పలుమార్లు మాణిక్యం తండ్రి ఏండుకొండలు, కళ్యాణ్ ను హెచ్చరించాడు. ఇది మనస్సులో పెట్టుకొని కళ్యాణ్ గతంలో రెండు సార్లు ఏడుకొండలు పశువుల మేతకు నిప్పు పెట్టాడు.
అంతటితో ఆగకుండా తనను ప్రేమించడం లేదనే అక్కసుతో మాణిక్యం ఇంటికి గురువారం రాత్రి చాకు తీసుకొని వెళ్ళాడు. ముందుగా యువతిపై దాంతో దాడి చేశాడు. అయితే అడ్డువచ్చిన మాణిక్యం చెల్లెలు వెంకట లక్ష్మీని, తల్లి భాగ్యలక్ష్మీ పైన కూడా అతడు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పారిపోయాడు.
ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులే క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు. నిందితుడు కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమోన్మాదుల దాడి సంఘటనలు భయాందోళనను కల్గిస్తున్నాయి.