బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు ‘అసని’ అని పేరు పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ అసని తుపాను ఏపీ సహా దేశంలోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. గంటకు 16 కిలో మీటర్ల వేగంతో కదులుతూ.. విశాఖపట్నంకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో పయనిస్తోందని స్పష్టం చేశారు.
ఈ తుపాను ఒడిశా పూరీకి 1030 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య దిశగా కదులుతూ.. రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వివరించారు. ఆదివారం సాయంత్రం వరకు సాధారణంగానే ఉంటోందని.. సోమవారానికి తీవ్రంగా మరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇది బలహీన పడే చాన్స్ ఉందంటున్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ఎఫెక్ట్ తో నేటి అర్థరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్టు తెలిపారు అధికారులు.
తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ తుపాను నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ పరిస్థితులను మోనిటర్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. ఈ మేరకు ఇత్తర్వులు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.