తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా అదిలాబాద్ లో 14డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, కామారెడ్డిలో 15డిగ్రీలు నమోదయ్యింది. మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, కొమురంభీం, వికారాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అయితే, ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని… వాతావరణం చల్లగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుందని, కొమరిన్ ఏరియా నుండి తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులంటున్నారు.
గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.