కరోనా తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి. పరిశ్రమ బాగా దెబ్బతినేసిందంటూ చాలామంది బడా నిర్మాతలు తమ సినిమాలకు భారీ టికెట్ రేట్లు తెచ్చుకున్నారు. సర్కారువారి పాట, కేజీఎఫ్2, ఆచార్య, ఆర్ఆర్ఆర్.. ఇలా చాలా సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఆ తర్వాత ఎఫ్3 సినిమా వచ్చింది. తమ సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచుతామని ప్రకటించారు. కానీ అవి కూడా ఎక్కువే అని జనం ఫీలయ్యారు.
ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని మేజర్ సినిమాకు అతి తక్కువ టికెట్ రేట్లు పెట్టారు. నిజంగా, ఇవి మాత్రం తక్కువ ధరలే. అడివి శేష్ హీరోగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన సినిమా మేజర్. ఈ సినిమా
ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న రిలీజ్ కు రెడీ అయింది. తాజాగాఈ చిత్ర సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు
అందరికీ అందుబాటులో ఉంచారు మేకర్స్.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 147, మల్టీప్లెక్స్‌లలో 195, 177 ధరలు ఉంటాయని తెలిపారు. కరోనా/లాక్ డౌన్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న పెద్ద సినిమా మేజర్ కావడం విశేషం.
26/11 దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు, రిపీట్ ఆడియన్స్ సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నారు.