గోపీచంద్ కొత్త సినిమా పేరు పక్కా కమర్షియల్. ఇందులో అతని పాత్ర అలాంటిది. డబ్బులు కోసం ఏ పనైనా చేస్తాడు. ఎంత చిన్న పనికైనా మనీ డిమాండ్ చేస్తాడు. ఇలాంటి కమర్షియల్ లాయర్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే సినిమాలో హీరో పక్కా కమర్షియల్ అయినప్పటికీ, బయట ఆ సినిమా నిర్మాత మాత్రం అంత కమర్షియల్ కాదు.
అవును.. పక్కా కమర్షియల్ సినిమాకు భారీ టికెట్ రేట్లు ఉండవని స్పష్టం చేశాడు నిర్మాత అల్లు అరవింద్. తన సమర్పణలో గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు దాదాపు టికెట్ రేట్లు ఖరారయ్యాయి. తెలంగాణలో పక్కా కమర్షియల్ టికెట్ రేటును 160 రూపాయలు(జీఎస్టీ అదనం)గా నిర్ణయించారు. అయితే మల్టీప్లెక్సుల విషయంలో ఈ రేటు ఓ 30 రూపాయలు అటు ఇటు అవ్వొచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి.. మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలుగా టికెట్ ధరలు నిర్ణయించారు. వీటన్నింటికీ జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇలా గోపీచంద్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అందుబాటు ధరల్లోనే ఉంచారు మేకర్స్. ఇలా చేయడం వల్ల థియేటర్లకు ఫుట్ ఫాల్ పెరుగుతుందని భావిస్తున్నారు.
ఒకప్పుడు చిన్న సినిమాకు కూడా మల్టీప్లెక్సులో 250 రూపాయల టికెట్ ఉండేది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేస్తే, జీఎస్టీతో కలిపి రేటు 285 రూపాయలు అయ్యేది. కానీ.. ఇప్పుడు టాక్సు, కన్వేయన్స్ ఫీజు కలిపినా కూడా టికెట్ రేటు 230 రూపాయలు దాటదు. కాబట్టి ఇది సగటు ప్రేక్షకుడికి శుభవార్తే. జులై 1న థియేటర్లలోకి వస్తోంది పక్కా కమర్షియల్ సినిమా.