సామాన్యుడికి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. గృహావసరాలకు ఉపయోగించే సిలిండర్ పై ధర రూ. 50 పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 999.50 గా ఉంది.
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడిపై మరింత భారం పడుతోంది.
ఈ నెల ప్రారంభంలో వాణిజ్య సిలిండర్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. వాణిజ్య సిలిండర్ (19 కేజీల)పై ధర రూ. 102.50 లను పెంచింది. దీంతో సిలిండర్ ధర రూ. 2253 నుంచి 2355.50లకు చేరుకుంది.
గత నెలలో వాణిజ్య సిలిండర్(19కేజీ)లపై అత్యధికంగా రూ. 250 లు పెంచారు. దీంతో సిలిండర్ ధర రూ. 2,253 లకు చేరింది. మార్చి నెలలో ఇదే సిలిండర్ పై రూ. 105లను చమురు కంపెనీలు పెంచాయి.