ఐపీఎల్-2022 కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జాయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు విజయం ఎవరిని వస్తుందనే టెన్షన్ అందరిలోనూ కనిపించింది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ లీగ్‌లో బొణీ కొట్టింది.
ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జాయింట్స్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ బ్యాట్స్ మెన్లు ఛేదించారు. ఛేజింగ్ ప్రారంభంలోనే గుజరాత్‌కు షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (0) ను ఔట్ చేసిన దుష్మంత చమీర.. మూడో ఓవర్లో విజయ్ శంకర్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశారు. కెప్టెన్ హర్ధిక్ పాండ్య (33), డేవిడ్ మిల్లర్ (30) రాణించారు. వీరికి రాహుల్ తెవాటీయా.. కేవలం 24 బంతుల్లోనే 40 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచారు. అందులో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు కూడా ఉన్నాయి. ఇక అభినవ్ మనోహార్ (15 నాటౌట్) తో కలిసి రాహుల్ తెవాటీయా మ్యాచ్‌ను ముగించారు.
ఇక పరుగుల ఖాతా తెరవకముందే షమీ బౌలింగ్‌లో లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యారు. డికాక్ (7), లూయూస్(10), మనీష్ పాండే(6) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆ తర్వాత దీపక్ హుడా(55), అయూష్ బదోనీ(54), క్రునాల్ పాండ్యా(21) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. తక్కువ స్కోరుకే పరిమితం అయిన లక్నో దాన్ని కాపాడుకునేందుకు చివరి దాకా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లక్నో ఆటగాళ్లు దీపక్ హూడా, ఆయుష్ హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలరల్లో చమీరా రెండు వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్యా, హుడా, ఆవేష్‌ఖాన్ చెరో వికెట్ సాధించారు. కాగా, లక్నో స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రాహుల్, డికాక్, మనీష్ పాండే దారుణంగా విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా, వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించారు. షమీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.