భారత ఆర్మీ తదుపరి చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సీ పాండే నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే పదవీకాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. దీంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి తదుపరి చీఫ్ గా పాండేను నియమించింది.
ఆయన మే1 న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా మనోజ్ సీ పాండే పనిచేస్తున్నారు. కార్ప్స్ ఆఫ్ కమాండర్ విభాగం నుంచి ఈ పదవీ చేపట్టిన తొలి కమాండర్ కావడం విశేషం.
ఆర్మీ చీఫ్ పదవి కోసం జై సింగ్ నయన్, యోగేంద్ర దిమ్రీ, అమర్దీప్ సింగ్ భిందర్ లు పోటీ పడ్డారు. కానీ వీరందరిలో అత్యంత సీనియర్ అయిన మనోజ్ పాండే వైపే కేంద్రం మొగ్గుచూపింది.
పాండే నాగపూర్ లో జన్మించారు. 1982లో ఆయన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమితులయ్యారు. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ విజయ్ లాంటి చాలా ఆపరేషన్స్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు.