యూపీ రాజధాని లక్నోలో లాయర్ దారుణ హత్యకు నిరసనగా తోటి లాయర్లు మృతదేహాన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు లోకి తీసుకెళ్లి నిరసన తెలిపారు. రెండు గంటల పాటు మృతదేహాన్ని కోర్టు హాల్లోనే ఉంచారు. లాయర్లు కోర్టు ముందు బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు వచ్చి సముదాయించడంతో అంత్యక్రియలకు తరలించారు.
శిషిర్ త్రిపాఠీ అనే (32) అనే న్యాయవాదిని మంగళవారం రాత్రి లక్నోలోని ఆయన ఇంటి బయటనే కొందరు కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశామని..మిగతా నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తి కూడా లాయరేనని చెప్పారు. ఓ ఆస్తి విషయంలో ఇద్దరు లాయర్ల వివాదమే హత్యకు కారణమన్నారు.
హత్యకు గురైన న్యాయవాది సోదరుడి చెప్పేది మరోలా ఉంది. తన సోదరుడు స్థానికంగా కొందరు సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడని..అందుకే హత్య చేశారని చెప్పాడు. స్థానికంగా గంజాయి అమ్మే వ్యక్తిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని..అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన అనంతరం డ్యూటీలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో స్థానిక పోలీస్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
లాయర్ హత్యపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నేరగాళ్ల చేతుల్లో ఉందా ? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.