ఐపీఎల్ సీజన్ 15లో అద్భుతం జరిగింది. సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. మొదటి వికెట్ కు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా లక్నో సూపర్ జైంట్స్ చరిత్ర సృష్టించింది. కేకేఆర్ తో తలపడిన ఎల్ఎస్జీ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా డికాక్, రాహుల్ వచ్చారు. మొదట్నుంచి కోల్ కతా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. డికాక్ 70 బంతుల్లో 140 పరుగులు చేశాడు. పది సిక్సులు, పది ఫోర్లతో చెలరేగిపోయాడు. రాహుల్ 51 బంతుల్లో 68 రన్స్ సాధించాడు. నాలుగు సిక్సులు, 3 ఫోర్లతో అలరించాడు.
రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లు ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తీయకుండా తేలిపోయారు. భారీ స్కోర్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్(0), అభిజిత్(4) రాణించలేదు. అయితే.. నితీష్ రాణా(42), శ్రేయాస్ అయ్యర్(50), బిల్లింగ్స్(36) పర్వాలేదనిపించారు.
16 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అప్పటికి రస్సెల్, రింకు సింగ్ ఆడుతున్నారు. అయితే.. 17వ ఓవర్ నాలుగో బంతికి రస్సెల్ పెవీలియన్ చేరాడు. 17వ ఓవర్ ముగిసే సమయానికి కేకేఆర్ ఆరు వికెట్లు కోల్పోయి 156 రన్స్ చేసింది. అప్పటికి 18 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉంది. 18వ ఓవర్ లో నరైన్ చెలరేగిపోయాడు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 18వ ఓవర్ ముగిసేసరికి 173 రన్స్ చేసింది కోల్ కతా.
ఇంకో రెండు ఓవర్లు ఉందనగా కేకేఆర్ 38 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్ మొదటి బంతిని సిక్స్ గా మలిచాడు నరైన్. తర్వాతి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. లాస్ట్ ఓవర్ కు 21 రన్స్ చేయాల్సి ఉండగా.. నరైన్, రింకు సింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కేకేఆర్ ఫ్యాన్స్. రింకు సింగ్ క్రీజ్ లో ఉన్నాడు. మొదటి బంతిని ఫోర్ కొట్టి.. రెండో బాల్ ను సిక్స్ గా మలిచాడు. మూడో బంతిని సిక్స్ బాదాడు. దీంతో కోల్ కతా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. చివరి మూడు బంతులకు 5 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకు నాలుగో బంతికి రెండు రన్స్ రాబట్టాడు. ఐదో బంతికి రింకు సింగ్ ఔట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం ఎవరిని వరిస్తుందా అని అంతా ఎదురుచూస్తుండగా… ఉమేష్ యాదవ్ వచ్చీ రాగానే ఔట్ కావడంతో లక్నో రెండు పరుగుల తేడాతో గెలిచింది.