ప్రధాని మోడీ ఇటీవల వారణాసిలో ఘనంగా ప్రారంభించిన లగ్జరీ క్రూజ్ నౌక’ గంగా విలాస్’ అక్కడినుంచి కదిలిన మూడు రోజులకే బీహార్ లో ఆగిపోయింది. చాప్రా జిల్లా లోని డోరీగంజ్ ఏరియాలో చిక్కుకుపోయింది. . గంగానదిలో తగినంత నీరు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిజానికి నది ఒడ్డుకు ఈ నౌక చేరుకున్న తరువాత పురావస్తు ప్రాధాన్యం గల హెరిటేజ్ సైట్ ‘చిరండ్’ కు వెళ్లాలని టూరిస్టులు తహతహలాడారు. చిరండ్ సరన్ అని వ్యవహరించే ఈ సైట్ ఇక్కడికి 11 కి.మీ. దూరంలో ఉంది.
ఘాఘ్రా నది ఒడ్డున గల ఈ విహార స్థలంలో హిందూ, బౌద్ధిజం, ముస్లిం సంస్కృతులు ఉన్నాయి. నదిలో నీరు లేక గంగా విలాస్ మధ్యలోనే నిలిచిపోయిన సమాచారం తెలిసిన వెంటనే చిన్న బోట్ల ద్వారా టూరిస్టులను రక్షించి.. ఈ సైట్ వద్దకు చేర్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ టీమ్ స్పాట్ కి చేరుకుంది. ఈ సైట్ వద్ద వీరి వసతికి తగిన ఏర్పాట్లు చేశామని చాప్రా జిల్లా అధికారి సత్యేంద్ర సింగ్ తెలిపారు.
నదిలో నీరు తక్కువగా ఉన్న ఫలితంగా ఈ నౌకను నదీ తీరం వద్దకు చేర్చడంలో సమస్య తలెత్తిందన్నారు. అందువల్లే చిన్న బోట్లను స్పాట్ వద్దకు పంపామన్నారు. గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ నౌక .. దిగువ ప్రాంతానికి వచ్చేసరికి గంటకు 20 కి.మీ. వేగాన్ని సంతరించుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇండియాలో ఈ నౌకలో ప్రయాణించాలంటే రోజుకు 25 వేల రూపాయలని, అదే బంగ్లాదేశ్ లో 50 వేల రూపాయలని ఈ వర్గాలు వెల్లడించాయి. తొలుత స్విట్జర్లాండ్ కు చెందిన కొందరు టూరిస్టులు గంగా విలాస్ నౌకలో ప్రయాణిస్తున్నారు. ముందు ముందు ఆయా నదుల్లో నీరు తక్కువగా ఉన్న పక్షంలో ఇది ఇలాంటి సమస్య ఎదుర్కొంటే ఆందోళనకరమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.