‘మా’లో మాకు ఎన్నో వుంటాయ్.. అనుకుంటాం.. మళ్లీ కలిసిసోతాం. ‘మా’ ఇష్టం! మీరెవరు అడగడానికి..’ అన్నట్టుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహరం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కి, రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ వస్తున్న వార్తలను ‘మా’ తోసిపుచ్చింది. ‘ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘మా’ వెల్ఫేర్‌కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మీటింగ్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి’ అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.
ఇదంతా బానేవుంది. లీకులు ఇచ్చేది మీరే. తీరా అవి మీడియాలో వచ్చాక ‘ఎందుకింత రచ్చ చేస్తున్నారూ..’ అంటూ క్లాసులు పీకేదీ మీరే. ఇదే ఇప్పుడు ఫిలింనగర్ టాక్.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. సింపుల్‌గా ‘మా’. పేరులో ఉన్న సఖ్యత కార్యవర్గంలో లేకపోవడమే ఇక్కడ విశేషం. మొన్నీ మధ్యే ఎన్నికలు పూర్తిచేసుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అధ్యక్షుడిగా సీనియర్ హీరో నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్… ఈ ఇద్దరి మధ్యా మొదటినుంచి ఎందుకనో విభేదాలు కొనసాగుతూనే వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడూ నరేశ్ అండ్ రాజశేఖర్ మధ్య వివాదం మొదలయింది. నరేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని రాజశేఖర్ పేర్కొనడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటై ఆరునెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు మా తరపున ఏ విధమైన ఫండ్స్ సేకరించలేదు. అలాగే చాలా రోజుల నుంచి ‘మా’లో జరిగే సమావేశాలకు అధ్యక్షుడి హోదాలో ఉన్న నరేశ్ హాజరు కావడం లేదట. ఎప్పుడూ తనకు ఏవో పనులున్నాయని చెబుతూ సమావేశాలకు హాజరు కావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మొన్న రాత్రి 11 గంటల సమయంలో ‘మా’ సభ్యులంతా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులంతా ఫండ్ కలెక్షన్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై చర్చించారు. అలాగే అధ్యక్షుడు నరేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా సిద్ధమయినట్టుగా సమాచారం. మరో వైపు నరేశ్ అసలు ఆ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తనకు ఎలాంటి సమాచారమూ అందలేదంటున్నారు. మరుసటి రోజే దీనిపై మళ్లీ ఓ మీటింగ్ పెట్టి.. మాలో మాకు గొడవలు వున్నాయని మీకెవరు చెప్పారంటూ ఖండన. ఇదండీ సంగతి. ఓవరాల్‌గా అక్కడేదో జరుగుతోంది. మాకెందుకు కానీ, మీలో మీరు పరిష్కరించుకుంటే పరిశ్రమకు మంచిది.. ఆర్టిస్టులకూ మంచిది.. అంటున్నాయి మీడియావర్గాలు. ‘మా’లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సినీ పెద్దలు కలుగచేసుకుని మంచి వాతావరణం నెలకొల్పేలా కృషి చెయ్యాల్సి ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.