భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కోల్‌కతాలో దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో కాన్వాయ్‌పై దాడి చేశారు. పశ్చిమబెంగాల్‌లోని అదికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌లోని కార్లపై దాడి చేశారు. ఈ క్రమంలో పలు కార్లు ధ్వంసం కాగా, కొందరు బీజేపీ నాయకులు గాయపడ్డారు. కాగా ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ విరుచుకుపడింది. సెక్యూరిటీ కల్పించడంలో విఫలం అయ్యారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కావాలనే దాడులు చేయించిందని అమిత్ షా ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నడ్డా గురువారం కోల్‌కతా చేరుకున్నారు. అక్కడి సౌత్ 24 పరగణాస్‌లో ఉన్న డైమండ్ హార్బర్‌కు నడ్డా కాన్వాయ్ బయల్దేరింది. ఎన్నికల నేపథ్యంలో సమాయాత్తం అయ్యేందుకు చేపట్టనున్న కార్యక్రమానికి నడ్డా హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమం కోసం వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అయితే దాడి జరిగిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. తాను మీటింగ్‌కు హాజరు అయ్యానంటే అది దుర్గా మాత ఆశీర్వాదమే అన్నారు. తమ పార్టీ నేతలు ముకుల్ రాయ్, కైలాష్ విజయ్ వర్జియాలకు దాడిలో గాయాలయ్యాయని, ప్రజా స్వామ్యానికే ఈ ఘటన అవమానకరమని అన్నారు. తమ కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటిపై దాడి చేశారన్నారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ప్రయాణిస్తున్నానని, అందువల్ల సురక్షితంగా బయట పడ్డానని అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని రౌడీయిజం అంతం అయ్యే సమయం ఆసన్నమైందన్నారు.
కాగా ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. బీజేపీ కావాలనే ఈ ఘటన జరిగేలా చేసిందని ఆరోపించారు. బీజేపీ ఒక కొత్త హిందూ ధర్మాన్ని సృష్టించాలని చూస్తుందన్నారు. హిట్లర్ కూడా గతంలో ఇలాగే చేసేవాడన్నారు. వారు కావాలనే సంఘటనలను సృష్టించి వాటి తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారు ఈ విధంగా లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. కాగా బీజేపీ నాయకుల కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రదేశం సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీ నియోజకవర్గం కావడం విశేషం.