ముంబయి: మీరు మ్యాక్‌బుక్ వాడుతుంటారా? మ్యాక్ ల్యాపీతో తరచూ ఫ్లయిట్ జర్నీలు చేస్తుంటారా? ఐతే.. చెప్పేది కాస్త వినండి. యాపిల్ మ్యాక్‌బుక్‌ప్రో పాతవెర్షన్లను చెక్‌ఇన్ లగేజీలో, హ్యాండ్ లగేజీలో అనుమతించేందుకు భారత్ సహా పలు దేశాల విమానయాన సంస్థలు ఒప్పుకోవడం లేదు. మ్యాక్‌బుక్‌ప్రోలో వున్న బ్యాటరీల కారణంగా ప్రమాదాలు జరగవచ్చన్న ప్రచారంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. జూన్‌లో యాపిల్ సంస్థే స్వచ్ఛందంగా 15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో లాప్‌టాప్‌లను రీకాల్ చేసింది. 2015-17 మధ్యలో ఉత్పత్తి చేసిన వాటిల్లో అమర్చిన బ్యాటరీ పేలే ప్రమాదం ఉన్నట్టుగా అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ హెచ్చరించింది. ఆ వార్నింగ్ తరువాత యాపిల్ వీటిని రీకాల్ చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ వినియోగదారులు లగేజీలో యాపిల్‌మ్యాక్ బుక్ ప్రోను తీసుకురావద్దని చెప్పడంతో అసలు స్టోరీ మొదలయ్యింది. తరువాత వరుసగా మిగిలిన విమానయాన సంస్థలు కూడా మ్యాక్‌కు నో అనేశాయి. అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్ అయితే వీటిని విమానాల్లోకి తేవడంపై పూర్తిగా నిషేధం విధించింది.
యాపిల్ సంస్థ లెక్కల ప్రకారం దాదాపు 26 కేసుల్లో యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో విపరీతమైన హీట్ సమస్యను ఎదుర్కొన్నట్టు తేలింది. ఐదుగురు వినియోగదారులకైతే గాయాలు కూడా అయ్యాయని వార్తలొచ్చాయి. కొన్నిచోట్ల పొగ వెలువడిందని వినియోగదారులు కంప్లయింట్ చేశారు. అమెరికాలో 4,32,000లు, కెనడాలో 26,000 మ్యాక్‌బుక్ ప్రో విక్రయాలు జరిగాయి. ఇవి వాడుతున్న వినియోగదారులు అర్జెంటుగా వీటిని ఓఎల్ఎక్స్ వంటి వాటిల్లో పెడతారో ఏంటో చూడాలి.