కరోనా టైమ్ లో నాన్-థియేట్రికల్ రైట్స్ భారీగా పెరిగాయి. ఇది చూసే హీరోలు కూడా తమ రెమ్యూనరేషన్లు పెంచేశారు. థియేట్రికల్ మార్కెట్ పెద్దగా లేకపోయినా చాలామంది హీరోలు తమ పారితోషికాలు సవరించడానికి కారణం ఇదే. ఈ క్రమంలో హీరో నితిన్ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ చుక్కల్ని తాకుతున్నాయి.
ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. రేపోమాపో అటుఇటుగా డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజానికి ఈ డీల్ నుంచి ఒక్క పైసా కూడా నిర్మాత, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి రాదు. ఎందుకంటే, ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఆల్రెడీ ఆయన అమ్మేశారు కాబట్టి. అవును.. సినిమా ప్రారంభంలోనే ఫైనాన్స్ అవసరమై, ఆదిత్య మ్యూజిక్ సంస్థకు నాన్-థియేట్రికల్ రైట్స్ రాసిచ్చేశారు. ఇప్పుడా రైట్స్ రూపంలో 30 కోట్ల రూపాయలు ఆశిస్తోంది సదరు సంస్థ. నాన్-థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి నితిన్ కెరీర్ లో కోట్ చేసిన అత్యథిక మొత్తం ఇదే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఈ పాట షూట్ కూడా పూర్తిచేయబోతున్నారు. మరోవైపు ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ కూడా పూర్తయింది. నితిన్ సరసన కృతిశెట్టి, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.