మూఢనమ్మకాలతో ఇద్దరు కూతుళ్లను చేజేతులా చంపుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లె దంపతులు.. తాము చేసిన హత్యలపై వింత సమాధానాలు చెబుతున్నారు. ఈ ఉదయం వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తొలుత కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించబోగా నిరాకరించారు. తాను శివున్ని అని.. తనకు కరోనా పరీక్షలు చేయడమేంటంటూ యువతుల తల్లి పద్మజ ఎదురు ప్రశ్న వేశారు. అసలు కరోనా చైనా నుంచి రాలేదని.. దేశంలో చెత్తను తొలగించేందుకు తన శరీరం నుంచి వైరస్‌ను బయటకు పంపించానంటూ పోలీసులతో వాదులాటకు దిగారు. చివరికి ఎలాగోలా వారికి పరీక్షలు నిర్వహించారు పోలీసులు.
మరోవైపు హత్యానేరం కింద ఇరువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తండ్రి పురుషోత్తమ నాయుడు ఏ1, తల్లి పద్మజ ఏ2గా పేర్కొన్నారు. హత్యలు ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. వాళ్లు మళ్లీ బతుకుతారు. మా ఇంట్లో కొన్ని రోజులుగా ఎన్నో మహిమలు జరిగాయి. అవి మీకు చెప్పినా అర్థం కావు. మా ఇంట్లో దేవుళ్లు ఉన్నారు.10 రోజులు తిండి లేకున్నా బతికే ఉన్నాం.. అంటూ ఏవేవో మాట్లాడినట్టుగా తెలిసింది.