హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. సాయి తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఎల్బీనగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి బైక్ తీసుకున్నాడని.. అతన్ని పిలిచి విచారిస్తున్నట్లు వివరించారు. బైక్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదన్నారు.
తేజ్ బైక్ కు సంబంధించి సమగ్ర విచారణ జరిపామని తెలిపారు మాదాపూర్ డీసీపీ. గతంలో పర్వతాపూర్ దగ్గర ఓవర్ స్పీడ్ కారణంగా రూ.1,135 చలానా వేశామని.. దాన్ని తాజాగా ఓ అభిమాని క్లియర్ చేశాడని చెప్పారు. ప్రమాదం సమయంలో 72 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నాడని… అయితే దుర్గం చెరువుపై మాత్రం 102 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపాడని వివరించారు.
సాయి తేజ్ రాష్ డ్రైవింగ్ తో పాటు నిర్లక్ష్యంగా బైక్ ను నడిపాడని చెప్పారు డీసీపీ. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ అయి కిందపడ్డాడని తెలిపారు. అలాగే అతని దగ్గర టూ వీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ తమకు లభ్యం కాలేదన్నారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే ఉందని చెప్పారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నాడని వివరించారు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు.