నగరంలో కలకలం రేపిన కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ల్యాండ్ విషయంలోనే వివాదం చెలరేగిందని తేల్చారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి, నిందితుడు ఇద్దరూ రౌడీషీటర్లే. వీరిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఇస్మాయిల్, మహ్మద్ ముజాహిదీన్ స్నేహితులు. వీళ్లిద్దరికీ జైలులో పరిచయం అయింది. జహీరాబాద్ కు సంబంధించిన మూడు ఎకరాల భూమిపై ఇస్మాయిల్ అతని స్నేహితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ల్యాండ్ జిలానీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఇస్మాయిల్. ముజాహిద్దీన్ కు జిలానీ రైట్ హ్యాండ్. రిజిస్ట్రేషన్ సమయంలో వీరి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల ప్రకారం జిలానీ నడుచుకోకుండా మాట మార్చడంతో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది.
స్థల వివాదం పరిష్కారం కోసం ముజాహిదీన్, జిలానీ మాదాపూర్ కి ఇస్మాయిల్ ను పిలిపించారు. ముజాహిదీన్, ఇస్మాయిల్ మాట్లాడుకుంటున్న సమయంలో గొడవ పెద్దదైంది. దీంతో జిలానీ గన్ బయటకు తీశాడు. కోపంతో ఇస్మాయిల్ పై కంట్రీమేడ్ వెపన్ తో ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
బాలనగర్ డీసీపీ సందీప్ రావు ఈ ఘటనపై మాట్లాడారు. పథకం ప్రకారమే కాల్పులు జరిపారా అనేది తెలియాల్సి ఉందన్నారు. జిలానీనే మొదటగా ఫైరింగ్ చేశాడని గుర్తించామని.. అతడిపైనా గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఇస్మాయిల్ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారని, నిందితుడి వాహనంలో ఇద్దరు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో జహంగీర్ అనే వ్యక్తి గాయపడ్డాడు అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం.. ల్యాండ్ సెటిల్మెంట్ కోసం పిలిచారని అన్నాడు. మాదాపూర్ లోని ఇడ్లీ బండి దగ్గర 3 గంటల ప్రాంతంలో టిఫిన్ చేశామని.. ఇస్మాయిల్, ముజాహిద్ మాట్లాడుకుంటూ ఉండగా గొడవ పెద్దదై.. జిలానీ గన్ తో కాల్పులు జరిపాడని వివరించాడు. ఇస్మాయిల్ తల వెనుక భాగంలో రెండు బుల్లెట్లు దూసుకుపోయాయని చెప్పాడు. తాను అడ్డుకోవడానికి వెళ్లానని.. తనపైనా కాల్పులు జరిపాడని తెలిపాడు.