సైంటిఫిక్ విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడిన సినీ హీరో, డైరెక్టర్ మాధవన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా జులై 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల నోట్లో పడ్డాడు.
అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించేందుకు, అంగారకుడి కక్ష్యలోకి అది చేరుకునేందుకు ఇస్రోకు పంచాంగం సాయపడిందన్నారు మాధవన్. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను దాటిందని వ్యాఖ్యానించారు. గ్రహ గతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయని మాధవన్ చేసిన వ్యాఖ్యలకు విరుచుకుపడ్డ నెటిజన్లు.. ఏకి పారేస్తున్నారు.
మాధవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సైన్స్ గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ.. ఏవి ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు నోరు విప్పకపోవడం మంచిదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘మరీ ఇంత మూర్ఖత్వమా?’ అని మరో యూజర్ విరుచుకుపడ్డారు. ఇంకొందరు మాత్రం మాధవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని మండిపడుడున్నారు.
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తీశారు. నంబి నారాయణపై అప్పట్లో గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన క్లీన్‌చిట్ తో బయటపడ్డారు. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్ లో కనిపించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే.. మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా పై పడుతుందా అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు సిని విశ్లేషకులు.